Sunday, February 8, 2009

మా మంచి వూరు....

మల్లోచ్చిన..

మా వూరు ఎంత మంచిగుంటది మీకు ఎర్కేనా ? మస్త్ వుంటది తెల్సా? ఇంతకి మా వూరు పేరు జెప్పనే లేదు గదూ.. తిరుమలగిరి , నల్గొండ డిస్ట్రిక్ట్ ల చాన తిర్మలగిరులు వున్నాయి అనిజెప్పి .. గుర్తు కోసం మా ఊరికి 'తొండ' అని ఒక తోక తగిలిచిండ్రు .. అది మా పక్కనుండే వూరు లే ..అందుకే అందరు మా వూరిని 'తొండ తిర్మలగిరి' అని పిలుస్తరు

ఇగ మా ఊరి గురించి జెప్పాలంటే ఎన్నో వున్నై..అసలు ఏడికెల్లి షురూ జేయ్యాలనే సమజైత లేదు..మా వూరిల రెండు పెద్ద పెద్ద గుట్టలున్నై(కొండలు) .. అందుకే మా ఊరి పేరు చివర్న 'గిరి' అని వొచింది.. ఆ రెండు గుట్టలు పక్క పక్కనే వుంటై ..అందులో ఒక గుట్ట మీద రెండు గుడులున్నై , ఒకటేమో ఆంజనేయుని గుడి ..ఎనుకటి నుంచి వుంది, ఇంకొకటేమో వెంకటేశ్వరా స్వామి గుడి..ఈ మద్యనే గట్టారు లే ..ఆ గుట్ట ఎంత పెద్దగుంటది తెల్సా.. బాప్ రే ..ఆ గుట్ట మీదికెక్కితే మా వూరు మొత్తం ఎంత మంచిగ కనిపిస్తది తెల్సా .. ఇప్పుడైతే జర తక్కువగాని .. మా చిన్నప్పుడైతే ఎప్పుడు టైం దొరకితే అప్పుడు దొస్త్ లందరం కల్సి గుట్టేక్కేతోల్లం ..ముఖ్యంగా మా వూరిల ఎడ్ల బండ్లు తిరిగే పండుగ అని ఒకటయ్యేది ఏడాదికొకసారి .. ఆ రోజు మా వూర్ల వున్న ఆడోల్లు , మగోల్లు అందరు గుట్టేక్కుతారు.. ఇగ ఆ రోజు జూడాల .. మా చిన్నప్పుడు మేం పోరగాల్లందరం , కులం, మతం, అని తేడాల్లేకుండా అందరం కల్సి పొద్దుగాల్నే గుట్ట మీది కేక్కేవాళ్ళం ..మా గుట్ట మీద కోతులు గూడా చానా ఎక్కువే .. ఇగ కోతుల్ని జూసుకుంట ..వచిపోయేతోల్లను జూసుకుంట.. ముఖ్యంగా ఆంజనేయుని దేవుని కాడ కొబ్బరి కాయ గొట్టి మొక్కడం అయిపోయినంక ,గుట్ట మీద దోస్త్లందరం గూసోని కొబ్బరి కుడుకలు తిన్కుంట .. అగోగో ..మా ఇల్లు అక్కడుంది.. మీ ఇల్లు అక్కడుంది ..అగోగో..ఆ తెల్లగ గనపడే డాబా ఇల్లు మాదే.. అక్కడ రెండు కొబ్బరి చెట్లు కనపడ్తున్నై జూడు .. హాన్.. అదే మా ఇల్లు .. ఆ దూరంగా నీళ్లు కనపడ్తున్నై జూడు అదే మనూరి పెద్ద చెరువు రా.. అబ్బ ఎంత మంచిగ కనిపిస్తుందిరా.. అరె మనూరి పెద్ద బడి (హైస్కూల్) ఏందిరా ..అంత చిన్నగా కనబడ్తుంది.. అరె రోడ్ మీద బోయే మనుషులేన్దిరా చిన్నగా చీమల్లెక్క గనిపిస్తుండ్రు.. అంటు పోరగాల్లందరం ..ఎంత బాగా ఎంజాయ్ జేసేతోల్లమో ..ఆ గుట్టల ఒక పెద్ద సొరంగం వుంది, ఆ సొరంగం గురించి ఇప్పటికి ఎన్నో కథలు చెప్తుంటారు.. ఆ సొరంగం మా ఊరి గుట్ట నుంచి వేరే ఏదో వూరు దాక వున్నదని అనుకుంటుంటారు .. ఎనకట ఎవరో రాజు తోవ్విపిచిందట.. ఇంక దాంట్లో దొంగలుంటారని.. బంగారం వుంటదని.. పులులు , సింహాలు కూడా వుందోచ్చునని .. ఎన్నో చెబుతుంటారు..

ఒకసారి ఏమైంది ఎర్కేనా .. మా పోరగాల్లందరం పెద్ద హీరోల్లాగా ఫీల్ అయిపోయి ..ఎలాగైనా సరే ఆ రోజు ఆ సొరంగం అంతు జూడల్నని .. ఓ పది పన్నెండు మందిమి కల్సి టార్చ్ లైట్లు , రబ్బరు టైర్లు అంటించుకొని , అగ్గిపెట్టెలు , అవి ఇవి బట్టుకొని లోపలకి బోయినం.. ఒకలకు వోక్లం ధైర్యం జెప్పుకుంట ..ఎట్లో గట్ల జర్రంత లోపల దాక మంచిగనే బోయినం.. ఇగ ఆ తర్వాత షురూ అయ్యింది.. తీస్కబోయిన రబ్బరు టైర్లు అయిపోయినాయి .. టార్చ్ లైట్లు సరిపోట్లే.. చిమ్మ చీకటి..అసలే లోపల అంత తడుంది , జారుతుంది..ఏమేమో సప్పుల్లు.. వింత వింత శబ్దాలు.. ఒకడు పాము అంటాడు ..ఒకడేమో తేలని అంటాడు.. దానికి తోడు బరించ లేనంత గబ్బిలాల కంపు వాసన.. ఇంకొకరిద్దరేమో ' ఇగ నా వల్ల కాదురా బై .. మీరోచినా రాకబోయినా నేను ఎన్కకు బోతా .. ఇంక జర్రంత లోపలకు బోయినమంటే ఇగ మల్ల మనం ఎన్కకు రాలేము .. ' అని బెదిరిస్తాడు..అప్పటికే మా గ్రూప్ ల ఒకరిద్దరికి లాగులు తడ్సినై బయమ్తోటి.. ఇగ అందరకి దర్ర్ షురూ అయ్యింది.. ఎన్కకు బోదామని డిసైడ్ అయ్యినం ..కాని దారి దోర్కట్లే.. ఒకరి చెయ్యి ఒకరంబట్టుకొని తోవ దోలాడుకుంట , దోలాడుకుంట ఎట్లోగట్ల బయటికి వచ్చినం.. హీరోల్లెక్క లోపలకు బోయి , జీరోల్లెక్క బయటకు వుర్కొచ్చినం .... వామ్మో నాకైతే రెండ్రోజులు నిద్రబట్లే..

ఇంకా..సంక్రాంతి పండగప్పుడు కూడా ఆ గుట్టేక్కే పతంగులు( కిట్స్) ఎగిరేసేవాళ్ళం.. ఆ గుట్ట మీద జారుడు బండ జారుతూ ఎన్ని లాగులు(నేకెర్స్) చిన్పుకున్నమో మాకే తెలవదు..

ఇగ ఇంకో గుట్టుందే దాన్ని మల్లన్న గుట్ట అని ఆంటారు.. ఆ గుట్ట మీద అనకొండ పాముందని..ఇంక ఏవేవో క్రూర మృగాలు కూడా వుంటై అని అంటూంటారు.. గాళ్ళు జెప్పెటివి అన్ని ఎంత వరకు నిజాలో నాకైతే తెల్వదుగని ..మీము శిత్పల పండ్లు ( సీతా ఫలం) తెన్పనీకి ఆ గుట్ట కు బోఎతోల్లం.. కాకపోతే జర్రంత బయమయ్యేది ..అయినగాని పోయేవాళ్ళం తెల్సా ... రెండు గుట్టల మద్యల వున్న గ్రౌండ్ ల క్రికెట్ తౌర్నమెంత్స్ గిట్ల పెట్టుకొని ఆడు కునేతోల్లం.. చిన్న చిన్న ప్రైజ్ లు గూడా ఇచికునేవాళ్ళం..

మా వురిలా పెద్ద బడి ( హై స్కూల్ ) వుందని జెప్పిన గదా ..గదే మా ఊరికి బడి , పార్కు, గ్రౌండ్ అన్నీ అదే .. ..పెద్ద పెద్ద చెట్లు ఉండేటివి.. మస్త్ పెద్ద గ్రౌండ్ ఉండేటిది.. బడి వదిలి పెట్టినంక ..సాయంత్రం ఐతే సాలు ..పోరగాల్లందరం బాచ్ లు బాచ్ లుగా బల్లెకు జేరుకునేతోల్లం.. జేరసేపు ఆడుకున్నంక , అక్కడుండే స్టేజి ల మీద , గద్దెల మీద గిట్ల గూసోని మస్త్ ముచ్చెట్లు జెప్పుకునేతోల్లం.. లొల్లి లొల్లి జేసేతోల్లం.. ఇగ పొద్దుగూకి చీకటైతుంది అనంగ నిమ్మలంగ ఇండ్లల్లకు జేరుకునేతోల్లం..

ఒక సారి ఏమైంది ఎర్కేనా.. ఎప్పటిలాగానే జరసేపు ఆడుకున్నంక అక్కడుండే స్టేజి మీద దోస్త్ లందరం గూసోని ముచ్చెట్లు జెప్పుకుంట వున్నాం , చీకటైన గాని ముచ్చెట్లు వదల్లె.. అట్లే గూసోని మాట్లాడు కుంట ఉన్నాం..ఒక్కసారే లైట్లేసుకొని ఒక బండి వచ్చి మా ముందు ఆగింది.. ఎవరబ్బా.. అని జూస్తే ..మా ఊరి ఎస్. ఐ ఇంకో ఇద్దరు పోలిసోల్లు ' హే ఎవర్రా మీరు.. ఇక్కడేం జేస్తున్నర్రా.. ఇంకోసారి ఈ టైం ల గాని ఇక్కడ గనిపిస్తే ..తోలు తీస్తా బిడ్డా.. అది..ఇదీ.. ' అని బెదిరిచిండ్రు.. వామ్మో నీ దండంబెడుత నాకైతే ఫై పానాలు పైననే బోయినై ...అది గాదు సారూ..గట్ల గాదు సారూ..అని ఏదో ఒకటి జెప్పి అక్కనుంది బయటపదినం.. ఇగ గప్పటి సంధి మల్ల సాయంత్రం టైం ల బల్లెకు బోవలంటేనే బయమయ్యేది..ఒక వేళ బోయినా గాని .. ఎక్కడ నుంచైనా స్కూటర్ సప్పుడైతే చాలు ఉర్కిపోయి దాసుకునేతోల్లం.. కొద్ది రోజులేలే..ఆ తర్వాత మల్లి షరా మామూలే..

ఇంక మా వూరిల ఒక పెద్ద చెరువు , ఇంక చాలా చిన్నచిన్న చేరువులున్నై .. పెద్ద చెరువు కట్ట మీద ఏప, మర్రీ చెట్ల కింద దోస్త్ లం కూసోని ఎన్నెన్ని ముచేట్లు జెప్పుకునోతోల్లం.. చెరువు నిండి నీళ్లు కట్ట పైదాకా వచినప్పుడైతే , ఆడోల్లు , మగోల్లు అందరం కల్సి కట్ట చివరదాక నడ్సుకుంతబోయి ..ఆ చెరువును , నీళ్ళను జూసి సంబరబదేతోల్లం .. చెరువు నిండి నప్పుడు జూస్తే..తినక పోయినా మా కడుపులు నిండేటివి.. స్వార్ధం లేని సంతృప్తి అసుంటిది మరీ.. చెరువు కాడ కాపలా వున్న ముత్రాశోల్ల కన్లల్ల బడకుంట , మేం గూడా గాలాలేసి చాపలూ, బుడ పరకలు పట్టేతోల్లం.. వాళ్లు గనక జూస్తే మాత్రం వొకటే ఉర్కుడు.. వుర్కుడే..ఉర్కుడు....

చిన్నప్పుడు మస్త్ గోలీలాట ఆడేవాళ్ళం , జిల్లా-గోనె ( కర్ర-బిల్లా) ,కబడ్డీ, పత్తాలాట ఆడే వాళ్ళం.. జేబునిండా గోలీలున్నప్పుడు కల్గే సంతోషం ఎన్ని లచ్చల రూపాయలు సంపాదిస్తే మాత్రం వస్తది చెప్పండి..

ఇంక మా ఉరిల .. మస్త్ పచ్చటి పొలాలు , ఎర్రటి చెల్కలూ..నల్ల రేగడ్లున్టై, మస్త్ పంటలు పండిస్తారు..

ఇంక చిన్నప్పుడు అనగానే నాకు ఇంకో విషయం యాద్ కొస్తది.. అదే..బావుల్లల్ల ఈత గొట్టడం, అబ్బో..నా చిన్నప్పటి టైం ల సగం టైం ఈత గొట్ట దానికేబోయింది.. ఎప్పుడు జూసినా బావులల్లనో.. కుంట లల్లనో.. చేరువులనో.. ఈత గోడుతూనే వుండే వాళ్ళం.. కన్లన్నీ ఎర్రగా అయ్యి, మొకాలన్నీ తెల్లగా పేలిపోయి, జుట్టంతా కరాబయ్యి, ఇంటికాడ ఎంత తిడుతున్న సరే..ఈత మాత్రం వదల్లె..ముఖ్యంగా ఎండా కాలం ల.. ఎవరు అందరికంటే ఎక్కువ ఎతుమీదికేల్లి దున్కతారు, ఎవరు ఎక్కువ సేపు నీల్లల్ల మునిగి వుంటారని పోటీలు బెట్టుకుంట , నీల్లల్ల ఆడుకునేతోలం..మా ఊరి నీల్లల్ల మా చిన్నప్పటి దోస్త్ లతోటి ఈత గోడుతుంటే ఆ మజాయే వేరు.

మా ఊరి పాత టూరింగ్ టాకీస్ అశోకా లో నేల టికెట్ (ఒక్క రూపాయి) కు పోయి పేపర్లు ఎగురేసుకుంట , ఈలలేసుకుంట సినిమాలు జూసేతోల్లం, పైసల్లెనప్పుడు కూడా ఎప్పుడైనా సినిమా జూడలనిపిస్తే తలపు సందులోంచి తొంగి తొంగి దొంగతనంగా సినిమా జూసేతోల్లం..

ఇంక ..ఎదురు బద్ధలతోటి , కట్టేలతోటి, బాణాలు తయారుజేసి పిట్టలగోట్టేతోల్లం, తొండల గొట్టేతోల్లం, రామాయణ, బహాభారత డ్రామా లాడు కునేతోల్లం.. గ్రూప్ లుగా విడిపోయి ఫైటింగ్ లు జేసుకునేతోల్లం..గంగిరెద్దుల ను అడిపిస్తుంటే మమ్మల్ని మేమే యాది మర్చి జూసేతోల్లం..నోట్లో కత్తి బెట్టుకొని , వంటినిండా రక్తం బూసుకొని , తాడు తోటి ఫట్ ఫట్ మని గొట్టుకుంట వచ్చే పెద్దోమ్మరోల్లను జూస్తే మాత్రం జరంత బయమయ్యేది, అయిన బయపడుకుంట బయపడుకుంట నే జూసేతోల్లం..

ఇంక ..బతుకమ్మ పండగోచిందంటే చాలు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అని లేకుండా మా ఊరి ఆడోల్లంత మా పాతూర్లున్న శివాలయం దగ్గర బతుకమ్మల్ని పెట్టి ఆడుతుంటే , మా పోరగాల్లమేమో ఆమ్మయిల్ని జూసుకుంట , టపాసులు కాల్సుకుంట, ఫలారం తినుకుంట మస్త్ ఎంజాయ్ చేసేతోల్లం..

ఇంక.. దొంగతనంగా కోసుకొని తిన్న జామ పళ్ళు , రేగు పళ్ళు, మామిడి పండ్లు, ఈత పండ్లు..ఒకటేమిటి మా వూర్ల అన్నీ పండ్లు మస్త్ గ ధోర్కుతై....

మా వూరుల తాడి చెట్లు కూడా ఎక్కువే.. మస్త్ కళ్లు ధోర్కుతది.. బాగా తాగేతోల్లం.. మా ఊరి కళ్లు ఎట్లుంటది ఎర్కేనా.. తాడి చెట్ల కింద కూసోని , గుగ్గిళ్ళు తినుకుంట ఒక్క సీసా తాగితే అంతే మల్ల ... ఔట్ గావాల్సిందే..

ఇంక.. మా ఊరి క్రాస్ రోడ్ ( ఎక్స్-రోడ్ ) కి బోయి హోటల్ లలో టిఫిన్ లు తినేతోల్లం..ఛాయలు తాగేతోల్లం(ఇంటికాడ తెలవకుండా..) ....బుధవారం వచిందంటే చాలు అంగడి ( మార్కెట్) , అంగడి కాడికి భాతాకాని గొట్టుకుంట నడ్సుకుంట బోయి కూరగాయలు, పండ్లు కొనుక్కోచుకునేతోల్లం.. అమ్మడానికి, కొనడానికి వచ్చిన రైతులు .. ఎడ్లు , బర్రెలు, గొర్రెలు .. ఎంత కల కలలాడుతుండేది మా మా ఊరి మార్కెట్..

మస్త్ ఎంజాయ్ జేసేతోల్లం.. అందుకే మా వూరంటే నాకు మస్త్ ఇష్టం..

చెప్పుకుంటూ బోతే ఎన్నో మతలబ్ లు, ఎన్నో ముచ్చెట్లు..

హాన్.. ఇప్పుడేముందిలే.. మా వూరు గూడ సిటీ లెక్కనే గాబట్టింది.. అప్పటి ఆ దోస్తిలు లేవు, ఆ ఆటలు లేవు, ఆ ప్రేమల్లేవు.... అంతా పైసల మయము అయిపోయింది.... ఎం జేస్తం....

వుంటా మరీ....ఇట్లు....

మీ తెలంగాణా పోరగాడు ..........ఎంకర్రెడ్డి

6 comments:

  1. masth vundhi po...superrrr..

    ReplyDelete
  2. venkat, Excellent!!!

    ReplyDelete
  3. nice article while reading i too remmember my village,how i spent my childhood ..good work

    ReplyDelete
  4. Anna....Good desription...okka matala cheppalante Goreti venkanna palle pata vinnatundhi

    Sankepally Naresh Reddy

    ReplyDelete